ఈ మిస్ ఫైరింగ్ లో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుంది.. రాహుల్ ను తెలంగాణ క్షమించదు: కేటీఆర్

  • ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ అని కేటీఆర్ ఎద్దేవా
  • ధరణిని ఎత్తేస్తామన్న రాహుల్ ను తెలంగాణ సమాజం క్షమించదని వ్యాఖ్య
  • పోడు భూముల పంపిణీ రాహుల్ కు కనిపించడం లేదా అని ప్రశ్న
నిన్నటి ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా ప్రతిస్పందించారు. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. కాంగ్రెస్ పార్టీ భారత రాబందుల పార్టీ అని అన్నారు. ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతికి, అసమర్థతకు.. ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. స్కాములే తాచుపాములై మీ యూపీఏను, కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేరని అన్నారు. 

తమ పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని... కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ అంతకన్నా కాదని... కాంగ్రెస్ ను, బీజేపీని ఒంటి చేత్తో ఢీకొట్టే ఢీ టీమ్ బీఆర్ఎస్ అని చెప్పారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా? అని మండిపడ్డారు. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సే అని అన్నారు.  

లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా? అర్థంలేని ఆరోపణలు చేసి.. ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది. నిర్మాణాత్మక ప్రతిపక్షాన్నని... ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షాన్ని కాదని అన్నారు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని చెప్పారు.  

కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపి.. ఇక్కడ 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరని అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది ఆ రాష్ట్ర ప్రజలే కానీ, కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పారు. సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడు భూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా అని ప్రశ్నించారు. కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలబడిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. బ్రోకర్లు, కబ్జాకోర్ల తరపున నిలబడే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కారు స్టీరింగ్ కేసిఆర్ గారి చేతిలో పదిలంగా ఉందని... కానీ, కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పిందని అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానమని... గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయమని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంటే మీకు అంత వణుకు ఎందుకని ప్రశ్నించారు. వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశానికి దొరికిన వజ్రాయుధం బీఆర్ఎస్ అని చెప్పారు.


More Telugu News