ప్రధాని మోదీ నివాసంపై ఎగిరిన డ్రోన్

  • తెల్లవారుజామున 5:30 గంటలకు ఘటన
  • హై సెక్యూరిటీ జోన్ లోకి రావడంతో కలకలం
  • అప్రమత్తమైన ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది
  • డ్రోన్ ను ఎగరవేసింది ఎవరనేది ఆరా తీస్తున్న ఢిల్లీ పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఓ డ్రోన్ అనుమానాస్పదంగా ఎగరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. డ్రోన్ ను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోక్ కల్యాణ్ మార్గ్ లో డ్రోన్ ఎగరడంపై అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. ప్రధాని నివాసం వద్ద నో ఫ్లై జోన్ అమలు చేయడంతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) తో భద్రత ఏర్పాటు చేస్తారు. హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌లు ఎగరకుండా నిరోధించడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా ఉంది. అయినప్పటికీ ప్రధాని నివాసానికి సమీపంలో సోమవారం ఉదయం డ్రోన్ ఎగరడం అధికారులను షాక్ కు గురిచేసింది.

డ్రోన్ కలకలం సృష్టించడంతో అప్రమత్తమైన ఎస్పీజీ సిబ్బంది పోలీసులతో కలిసి ఆ డ్రోన్ ను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అంత సమీపంలోకి డ్రోన్ ఎలా వచ్చింది, దానిని ఎగరవేసింది ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సమాచారం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ని సంప్రదించినా.. ప్రధాని నివాసం వద్ద ఎగిరే వస్తువును గుర్తించలేదని ఏటీసీ అధికారులు వెల్లడించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.


More Telugu News