'ప్రాజెక్టు K' విషయంలో అదే టాక్ .. బ్యాలెన్స్ చేసినట్టే!

  • ప్రభాస్ సినిమాల్లో పెరుగుతున్న బాలీవుడ్ ఆర్టిస్టులు 
  • 'ఆదిపురుష్' అనువాద చిత్రంగా అనిపించడానికి అదో కారణం
  • 'ప్రాజెక్టు K' విషయంలో అలా జరగకుండా చూసుకున్న నాగ్ అశ్విన్ 
  • టాలీవుడ్ స్టార్స్ తో బ్యాలెన్స్ చేసిన దర్శకుడు  

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఒక సినిమాకి మించి మరొక సినిమా బడ్జెట్ విషయంలో పోటీ పడుతున్నాయి. అయితే ఇంతవరకూ ఆయన నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలలో 'సాహో' .. 'రాధే శ్యామ్' .. 'ఆదిపురుష్' ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాయి. వసూళ్ల పరంగా అనుకున్న టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగిపోయాయి. 

ఇతర భాషల .. ప్రాంతాల సంగతి అటుంచితే, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ సినిమాలు మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయాయి. కథాకథనాలు ఇందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కానీ మరో కారణం కూడా లేకపోలేదు .. అదే స్టార్ కాస్టింగ్. అవును .. ప్రభాస్ సినిమాలలో బాలీవుడ్ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రధానమైన పాత్రలలో సినిమా అంతటా వారు కనిపిస్తున్నారు. దాంతో హిందీ సినిమాను తెలుగులో వదిలారా? అనే ఒక ఆలోచనలో పడేస్తున్నారు. 

ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' విషయంలోనూ ఇదే జరిగింది. ప్రభాస్ తప్ప మిగిలిన వాళ్లంతా బాలీవుడ్ కి చెందినవారే. దాంతో ఇది మన సినిమా అని తెలుగు ప్రేక్షకులు అనుకోలేకపోయారు. పాన్ ఇండియా సినిమా మార్కెట్ కి ఇతర భాషలకి చెందిన ఆర్టిస్టులు అవసరమే. అయితే ఆ సంఖ్య ఎక్కువైపోవడం ఆ సినిమా ఫలితంపై ఎఫెక్ట్ చూపిస్తోంది. 

ఇక 'ప్రాజెక్టు K' విషయంలోనూ ఇదే జరుగుతుందనే కామెంట్లు కాస్త గట్టిగానే వినిపిస్తూ వచ్చాయి. అందుకు కారణం ఆ సినిమాలో అమితాబ్  .. దీపిక పదుకొణె .. దిశాపటాని కీలకమైన పాత్రలను పోషించడమే. అయితే తాజాగా రీసెంట్ గా ఈ ప్రాజెక్టులోకి కోలీవుడ్ నుంచి కమల్ ను .. సూర్యను తీసుకున్నారు. కమల్ - సూర్యను తమిళ హీరోలుగా తెలుగు ప్రేక్షకులు భావించరు. అందువలన ఇది బాలీవుడ్ సినిమా అనే ఫీలింగ్ కూడా రాదు. మొత్తానికి నాగ్ అశ్విన్ తెలివిగానే ఇక్కడ బ్యాలెన్స్ చేశాడనుకోవాలి. 


More Telugu News