నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కేంద్ర మంత్రులుగా ప్రఫుల్, ఫడ్నవీస్?

  • ప్రగతి మైదాన్ ప్రాంగణంలో మోదీ అధ్యక్షతన సమావేశం
  • మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలకు అవకాశం
  • బీజేపీ పలు రాష్ట్రాల చీఫ్ లను మార్చనున్నట్లు ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ప్రచారం జరుగుతుండడం, ఆదివారం మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కేబినెట్ లో పలువురికి చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ జాతీయ కార్యదర్శి ప్రఫుల్ పటేల్ కు మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ కు ప్రఫుల్ అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ప్రఫుల్ ను కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా కేంద్ర మంత్రి పదవి వరించనున్నట్లు సమాచారం. మిత్ర పక్షాలకూ కేబినెట్ లో సరైన స్థానం కల్పించేలా మోదీ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులలో మార్పులు చోటుచేసుకోనున్నాయని, త్వరలో దీనికి సంబంధించిన నిర్ణయాలు వెలువడుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.


More Telugu News