అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో వాలిపోయిన జాక్ మా.. చైనాకు తెలియకుండా రహస్య పర్యటన

అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో వాలిపోయిన జాక్ మా.. చైనాకు తెలియకుండా రహస్య పర్యటన
  • చైనా రాయబార కార్యాలయానికి తెలియనంత గోప్యంగా పర్యటన
  • పాకిస్థాన్‌లో ఉన్నది 23 గంటలే
  • పాకిస్థాన్‌లో వ్యాపారావకాశాలను పరిశీలిస్తున్న జాక్ 
చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అకస్మాత్తుగా పాకిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర చర్చకు కారణమైంది. జూన్ 29న లాహోర్‌లో వాలిపోయిన జాక్ మా 23 గంటలపాటు అక్కడే ఉన్నట్టు బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ మాజీ చైర్మన్ ముహమ్మద్ అజ్ఫర్ ఎహసాన్ తెలిపారు. అయితే, ఈ పర్యటనలో జాక్ మీడియా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను కలవకపోవడం గమనార్హం. ఓ ప్రైవేటు ప్రాంతంలో బస చేసిన మా.. జూన్ 30న ఓ ప్రైవేట్ జెట్‌లో తిరుగు పయనమయ్యారు. 

పాకిస్థాన్‌లో మా ఎందుకు పర్యటించారన్న వివరాలు బయటకు రాకపోవడం చర్చకు కారణమైంది. అయితే, రాబోయే రోజుల్లో ఇది పాకిస్థాన్‌కు సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఎహసాన్ అభిప్రాయపడ్డారు. ఐదుగురు చైనీయులు, ఒక డేనిష్, ఒక అమెరికా వ్యక్తితో కలిసిన వ్యాపార బృందంతో మా పాక్‌లో అడుగుపెట్టారు. ఓ చార్టెడ్ విమానంలో వారు నేపాల్ నుంచి పాకిస్థాన్‌కు చేరుకున్నారు. 

మా పాక్ పర్యటనపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. పాకిస్థాన్‌లో వ్యాపారావకాశాలను పరిశీలించేందుకే మా, ఆయన బృందం వచ్చినట్టు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మా పాక్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని ఎహసాన్ ఓ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే.. మా పర్యటన అక్కడి చైనా రాయబార కార్యాలయానికి కూడా తెలియనంత గోప్యంగా జరగడం!


More Telugu News