శృంగారానికి సమ్మతి వయసు తగ్గించాలి.. కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్ట్ బెంచ్ సూచన

  • సామాజిక పరిస్థితులు మారాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం
  • తప్పిదం ఇద్దరిదైనా బాలురపైనే నేరారోపణలంటూ కామెంట్
  • బాలికపై అత్యాచారం కేసు విచారణలో గ్వాలియర్ బెంచ్ కీలక వ్యాఖ్యలు
సామాజిక మార్పులకు అనుగుణంగా శృంగారానికి సమ్మతి తెలిపే వయసును తగ్గించాల్సిన అవసరం ఉందని మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో ఉన్నట్లుగా ఉమెన్ కన్సెంట్ ఏజ్ ను 16 ఏళ్లకు తగ్గించాలంటూ కేంద్రానికి సూచించింది. దీనివల్ల టీనేజ్ బాలురపై చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని పేర్కొంది. కిశోర ప్రాయంలో బాలబాలికలు పరస్పరం లైంగిక ఆకర్షణకు లోనవుతున్నారని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ఇందులో ఇరువురి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు మాత్రమే శిక్షకు గురికావాల్సి వస్తోందని తెలిపింది. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ వల్ల టీనేజ్ పిల్లల్లో 14 ఏళ్ల వయసుకే పెద్దరికం వచ్చేస్తోందని హైకోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు.

ఈమేరకు ఓ బాలికపై పదేపదే అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడంటూ 2020లో దాఖలైన కేసును గ్వాలియర్ బెంచ్ కొట్టేసింది. విద్యాపరమైన శిక్షణకు వెళితే మత్తుపానీయం ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని, దానిని కెమెరాలో రికార్డు చేసి బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడని బాలిక ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా ధర్మాసనం శృంగారానికి సమ్మతి వయసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతికి సవరణ చేయకముందు ఉమెన్ కన్సెంట్ ఏజ్ 16 ఏళ్లుగానే ఉండేదని ధర్మాసనం గుర్తుచేసింది.


More Telugu News