క్యాచ్‌లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్...: స్కాట్లాండ్‌తో ఓటమిపై విండీస్ కెప్టెన్

  • తమ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయామన్న షాయ్ హోప్ 
  • ఈ పిచ్‌పై టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారన్న కెప్టెన్
  • స్కాట్లాండ్ జట్టుపై ప్రశంసలు
ప్రపంచ కప్ సూపర్ సిక్స్ క్వాలిఫయర్ మ్యాచ్ లో స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాదాపు గత ఐదు దశాబ్దాల్లో వన్డే ప్రపంచ కప్ కు విండీస్ అర్హత సాధించకపోవడం ఇదే మొదటిసారి. తమ ఓటమిపై విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. వాస్తవానికి తాము స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయామని చెప్పాడు. ఈ టోర్నీ సవాల్ తో కూడుకున్నదని, ఈ మ్యాచ్ లో తాము టాస్ గెలిస్తే బాగుండేదన్నాడు. టాస్ ఎప్పుడూ కీలకమే అన్నాడు. ఈ పిచ్‌పై టాస్ గెలిచిన వారు ఎవరైనా బౌలింగ్ ఎంచుకుంటారని చెప్పాడు. ఇది తమను నిరాశపరిచిందన్నాడు.

తమ జట్టుకు ఏదీ కలిసి రాలేదని, క్యాచ్‌లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ ప్రభావం చూపినట్లు చెప్పాడు. ఆటలో ఇవి సహజమేనని, తాము వంద శాతం ప్రయత్నం చేయలేదని భావిస్తున్నామన్నాడు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా తాము మంచి జట్టుగా ఉండాలని కోరుకోలేమని, అలాగే, ఉదయమే మేల్కొని గొప్ప జట్టుగా ఉండాలని ఆశించలేరన్నాడు. 

భారత్ లో జరగనున్న ప్రపంచ కప్ కు అర్హత సాధించనందున మిగిలిన రెండు ఆటలనైనా సద్వినియోగం చేసుకొని, తమ అభిమానులకు కాస్త వినోదాన్ని పంచుతామన్నాడు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని, నిలకడగా ఆటలేకపోవడం దెబ్బతీసిందన్నాడు. అదే సమయంలో స్కాట్లాండ్‌పై ప్రశంసలు కురిపించాడు. స్కాట్లాండ్ అద్భుతంగా ఆడిందని, ఆ జట్టు బౌలర్లు రాణించారన్నాడు. వారిలో గెలవాలనే పట్టుదల, కసి కనిపించాయన్నాడు.


More Telugu News