ఎనిమిది నెలలుగా లో దుస్తులు చోరీ చేస్తున్న వ్యక్తి... గ్రామంలో చిచ్చు రేపిన వ్యవహారం

  • అహ్మదాబాద్ వద్ద ఓ గ్రామంలో ఘటన
  • పక్కింటి మహిళ లో దుస్తులపై కన్నేసిన వ్యక్తి
  • సెల్ ఫోన్ లో రికార్డు చేసి దొంగను పట్టేసిన మహిళ
  • ఎందుకు చోరీ చేస్తున్నావని నిలదీసినందుకు మహిళపై దాడి
అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామంలో అనూహ్య రీతిలో చిచ్చు రేగింది. కొట్లాటలు జరిగి పదిమందికి గాయాలు అయ్యాయి... 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికంతటికీ కారణం... ఓ మహిళ లో దుస్తులు చోరీకి గురవడమే. 

పచ్చామ్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళ... తన పొరుగింటి వ్యక్తి తన లో దుస్తులు చోరీ చేస్తున్నాడని జూన్ 27న ఆరోపించింది. ఈ తంతు గత 8 నెలలుగా సాగుతోందని వెల్లడించింది. పెరట్లో తాడుపై ఆరేసిన లో దుస్తులు మాయం అవుతుండడం పట్ల మొదట్లో ఆమెకేమీ అర్థం కాలేదు. అందుకోసం రహస్యంగా సెల్ ఫోన్ అమర్చి, చోరీ తతంగాన్ని చిత్రీకరించింది. పక్కింట్లో ఉన్న వ్యక్తే తన లో దుస్తులు చోరీ చేస్తున్నాడని గుర్తించింది. 

ఆ తర్వాత రోజు అతడు ఎప్పట్లాగే లో దుస్తులు చోరీ చేసి వెళుతుండగా, అతడిని ఆ మహిళ అనుసరించింది. అతడి ఇంట్లో తన లో దుస్తులన్నీ గుర్తించి, అతడితో వాగ్వాదానికి దిగింది. తన బండారం బయటపెట్టిందన్న ఆగ్రహంతో ఆ వ్యక్తి మహిళపై దాడి చేశాడు. 

మహిళ గట్టిగా అరవడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడి వచ్చారు. ఆ వ్యక్తికి మద్దతుగా అతడి బంధువులు కూడా రంగంలోకి దిగారు. దాంతో లో దుస్తుల గొడవ కాస్తా గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. 

దాంతో పోలీసులు ఆ మహిళపై, ఆమె కుటుంబ సభ్యులపై.... పొరుగింటి వ్యక్తిపై, అతడి బంధువులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలతో సంబంధమున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News