షర్మిల కాంగ్రెస్ లో చేరిక అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చింతా మోహన్

  • వైఎస్సార్టీపీ స్థాపించిన షర్మిల
  • తెలంగాణ రాజకీయాల్లో దిగిన వైనం
  • షర్మిల కాంగ్రెస్ లో చేరుతోందంటూ ఇటీవల ప్రచారం
  • ఆమెను తెచ్చుకుని నెత్తిన పెట్టుకోలేమన్న చింతా మోహన్
వైఎస్సార్టీపీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఖండించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతోందంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని, అదంతా ఒట్టి అబద్ధపు ప్రచారమేనని కొట్టిపారేశారు. 

వైఎస్సార్ ను నెత్తినపెట్టుకుని కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని, మళ్లీ ఆ తప్పు చేయదలుచుకోవడంలేదని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డికీ కుమార్తెలు ఉన్నారని... మరి వారు కాంగ్రెస్ లో చేరుతున్నారా? అని వ్యాఖ్యానించారు. వాళ్లు ఎలాగో... షర్మిల కూడా అలాగేనని చింతా మోహన్ స్పష్టం చేశారు. 

షర్మిలను పిలిచి నెత్తినపెట్టుకుని కాంగ్రెస్ నాయకత్వం అప్పగించడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. అసలు, షర్మిల కోసం కాంగ్రెస్ నేతలెవరూ ఇడుపులపాయకు రావడం లేదని అన్నారు. 

ఇటీవల షర్మిల కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తో రెండు పర్యాయాలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలుస్తారని.... త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ ను సందర్శిస్తారని కథనాలు వచ్చాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమంటూ కొన్ని మీడియా చానళ్లు అదే పనిగా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో చింతా మోహన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. 


More Telugu News