యాషెస్ కంటే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చాలా పెద్దది: క్రిస్ గేల్

  • ప్రపంచ కప్ లో భారత్ కు బూమ్రా, సూర్యకుమార్ గేమ్ చేంజర్లు అన్న గేల్
  • బూమ్రా త్వరగా కోలుకొని వీలైనంత త్వరగా జట్టులోకి వస్తాడని ఆశాభావం
  • అక్టోబర్ 15న మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్న గేల్
వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్ పై చర్చ సాగుతోంది. ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి భారత గడ్డపై వరల్డ్ కప్ జరగనుండగా, అక్టోబరు 15న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ పోరు జరగనుంది.

ఈ నేపథ్యంలో, విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ సందర్భం వచ్చినప్పుడల్లా పాక్-భారత్ మ్యాచ్‌పై స్పందిస్తున్నాడు. తాజాగా మరోసారి దాయాదుల పోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత్ - పాక్ మ్యాచే ప్రపంచ క్రికెట్ లో అత్యంత ఆదరణ కలిగిన పోరుగా అభివర్ణించాడు. గత ఏడాది ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో ఈ దాయాదుల పోరును కోట్లాదిమంది వీక్షించారని గుర్తు చేశాడు. అలాగే 2019లో వన్డే ప్రపంచ కప్ లో భారత్ - పాక్ మ్యాచ్‌కు 273 మిలియన్ల వ్యూస్ వచ్చాయని పేర్కొన్నాడు.

"యాషెస్‌ కంటే భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్  సమరం చాలా పెద్దది. ఈ దాయాదుల పోరును ప్రపంచ వేదికపై కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు. అక్టోబర్ 15న ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అని గేల్ అన్నాడు. 

అలాగే ప్రపంచ కప్ లో భారత్ తరఫున మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కూడా గేల్ చెప్పాడు. వన్డే ప్రపంచ కప్‌లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు కీలకమవుతారని, వాళ్లే జస్ప్రీత్ బూమ్రా, సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాడు. విశ్రాంతి తీసుకుంటున్న బూమ్రా కోలుకొని వీలైనంత త్వరగా జట్టులోకి వస్తాడనే నమ్మకముందని గేల్ అన్నాడు.


More Telugu News