కొత్త పాత్రలో రాజమౌళి.. ఐఎస్‌బీసీ గౌరవాధ్యక్షుడిగా నియామకం!

  • గ్రామీణ క్రీడాకారులను పోత్సహించేందుకు ఏర్పాటైన క్రికెట్ బోర్డు
  • ఇప్పటికే ఐఎస్‌బీసీకి జాయింట్ సెక్రెటరీగా రాజమౌళి కుమారుడు కార్తికేయ
  • తాను ధోనీ ఫ్యానేనన్న రాజమౌళి
  • ధోనీ లాంటి వజ్రాలు మన దేశంలో చాలా ఉన్నాయని వ్యాఖ్య
‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా‌తో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) గౌరవాధ్యక్షుడిగా రాజ‌మౌళి నియ‌మితుల‌య్యారు. త్వరలోనే రాజమౌళి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ, తాను ధోనీకి పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పారు. అభివృద్ధి చెందని దూర ప్రాంతం రాంచీ నుంచి ఆయన వచ్చారని అన్నారు. ధోనీ లాంటి వజ్రాలు మన దేశంలో చాలా ఉన్నాయని చెప్పారు. అలాంటి వారిని వెలికి తీసి, ఒక వేదిక కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. 

గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్‌గా ఎదగాలనుకునే వారిని గుర్తించి, ప్రోత్స‌హించేందుకు మాజీ క్రికెట‌ర్ దిలీప్ వెంగ్ స‌ర్కార్ గైడెన్స్‌లో ఐఎస్‌బీసీ ఏర్పాటైంది. ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ అవ‌కాశాలు, స‌దుపాయాలు లేక ఎదురు చూస్తున్న ఎంద‌రికో అండ‌గా నిలుస్తోంది. దేశం మొత్తం దాదాపు పాతిక కోట్ల మంది విద్యార్థుల‌ను టీమ్స్‌గా విభ‌జించి ప‌లు టోర్న‌మెంట్స్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఐఎస్‌బీసీకి జాయింట్ సెక్రెటరీగా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఉన్నారు. ఈ సంస్థకు చీఫ్‌ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఉండగా.. వెటరన్‌ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్ ప్రధాన సలహాదారుగా కొనసాగుతున్నారు.  

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబుతో సినిమా చేయ‌టానికి రాజ‌మౌళి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


More Telugu News