వరల్డ్ కప్ కు వేదికల ఎంపికలో మాకు అన్యాయం జరిగింది.... బీసీసీఐకి లేఖ రాసిన పంజాబ్ క్రీడల మంత్రి

  • అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్
  • 10 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు
  • పంజాబ్ లోని మొహాలీ స్టేడియంకు ఒక్క మ్యాచ్ కూడా కేటాయించని బీసీసీఐ
  • మేటి క్రికెటర్లను అందించిన పంజాబ్ పట్ల వివక్ష చూపారన్న మంత్రి గుర్మీత్ సింగ్ 
అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఇటీవలే బీసీసీఐ ఈ భారీ ఈవెంట్ షెడ్యూల్ ప్రకటించింది. దేశంలోని 10 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. అయితే, తమ రాష్ట్రంలో ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా లేదని పంజాబ్ క్రీడల శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ హయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

భారత క్రికెట్ కు పంజాబ్ ఎంతోమంది మేటి ఆటగాళ్లను అందించిందని, అలాంటి రాష్ట్రానికి వరల్డ్ కప్ వేదికల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి లేఖ రాశారు. 

బిషన్ సింగ్ బేడీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, లాలా అమర్నాథ్, మొహీందర్ అమర్నాథ్, మదన్ లాల్, యశ్ పాల్ శర్మ, శుభ్ మాన్ గిల్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లను అందించిన రాష్ట్రం పంజాబ్ అని గుర్మీత్ సింగ్ వివరించారు. కానీ, పంజాబ్ లో ఒక్క మైదానానికి కూడా వరల్డ్ కప్ మ్యాచ్ ను కేటాయించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. ఇది తమ పట్ల వివక్ష చూపించడమేనని పేర్కొన్నారు. పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్  హయర్ ఇప్పటికే తన అభిప్రాయాలను ఓ వీడియో రూపంలోనూ విడుదల చేశారు. 

కాగా, పంజాబ్ కే కాదు, ఏపీకి కూడా వరల్డ్ కప్ ప్రధాన మ్యాచ్ లు కేటాయించలేదు. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ వరల్డ్ కప్ పోటీలకు ముంబయి, కోల్ కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పూణే, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, బెంగళూరు నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి.


More Telugu News