ఫ్రాన్స్ తగలబడుతుంటే.. సంగీత కచేరీలో అధ్యక్షుడు.. ఇదిగో వీడియో!

  • ఆందోళనలతో నాలుగు రోజులుగా అట్టుడుకుతున్న ఫ్రాన్స్ 
  • బ్రిటిష్ సింగర్ ఎల్టాన్‌ జాన్‌ కన్సర్ట్‌కు భార్యతో కలిసి వెళ్లిన మేక్రాన్‌
  • వీడియోలు వైరల్.. అధ్యక్షుడి తీరుపై తీవ్ర విమర్శలు
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడట. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తీరు కూడా ఇలానే ఉంది. ఆందోళనలతో దేశమంతా అట్టుడుకుతుంటే.. ఈయన మాత్రం మ్యూజిక్ కన్సర్ట్‌ (కచేరీ)లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కావడంతో మేక్రాన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరిగిన బ్రిటిష్ సింగర్ ఎల్టాన్‌ జాన్‌ కన్సర్ట్‌కు మేక్రాన్‌, ఆయన భార్య హాజరయ్యారు. భార్యతో కలిసి కాలుకదిపారు. ఆ వీడియోలను చూసి నెటిజన్లు మేక్రాన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆందోళనకారులు ఫ్రాన్స్ నగరాల్లో విధ్వంసం సృష్టిస్తుంటే.. మేక్రాన్‌ మాత్రం మ్యూజిక్ కన్సర్ట్‌లో ఉన్నారని ఓ నెటిజన్ మండిపడ్డారు.

నిజానికి ఆ ఈవెంట్‌ బుధవారం జరిగింది. అప్పటికి ఘర్షణలు మొదలైనా.. అంత ఉద్ధృతంగా లేవు. కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక టీనేజ్‌ పిల్లాడు చనిపోతే.. మేక్రాన్‌ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటన ఫ్రాన్స్‌ను కుదిపేస్తోంది. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తునే ఉన్నారు. మంగళవారం నుంచి ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది.


More Telugu News