నేనూ ఆ డిప్రెషన్ ఎదుర్కొన్నా: కాజల్ అగర్వాల్
- ప్రసవానంతర డిప్రెషన్‌ను ఎదుర్కొన్నానన్న కాజల్
- ఆ డిప్రెషన్‌తో బాధపడుతుంటే కుటుంబం అండగా నిలవాలని సూచన
- ప్రసవం తర్వాత కొంత సమయాన్ని మహిళలు కేటాయించుకోవాలని సలహా
పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ‘ఇండియన్-2’, ‘సత్యభామ’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తన అభిమానులతో ఆమె సరదాగా ముచ్చటించింది. ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చింది.
ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ప్రసవానంతర (పోస్ట్ పార్టమ్) డిప్రెషన్‌ను ఎదుర్కొన్నానని కాజల్ చెప్పింది. అది సర్వసాధారణమని, మహిళలు ఎవరైనా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే కుటుంబం వారికి అండగా నిలవాలని సూచించింది.
పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత సమయాన్ని మహిళలు కేటాయించుకోవాలని కాజల్ చెప్పింది. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్లు చేయడం, ఇష్టమైన వ్యక్తులతో సమయం గడపటం వంటి చిన్న చిన్న పనులతో పోస్ట్‌పార్టమ్ దశను దాటొచ్చని తెలిపింది.
తనను ఎంతగానో అర్థం చేసుకునే కుటుంబసభ్యులు ఉండటం వల్ల ఆ దశ నుంచి వెంటనే బయటకు రాగలిగానని తెలిపింది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమయంలో తన భర్త గౌతమ్ క్లిష్టమైన సమయం చూశారని వివరించింది.
ఇక తన కొడుకు నీల్ బాగున్నాడని, వర్క్ వల్ల ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తన కుటుంబమే అతడిని చూసుకుంటుందని వెల్లడించింది. తాను నటిస్తున్న సత్యభామ సినిమా.. ఓ పోలీస్ డ్రామా అని తెలిపింది.
‘‘నా కెరియర్‌లో ప్రతి రోల్ నాకు ఒక మధురానుభూతిని అందించింది. నందిని (డార్లింగ్), ప్రియ (మిస్టర్ పర్‌ఫెక్ట్), మిత్రవింద (మగధీర), అలాగే ఇప్పుడు సత్యభామ. ఇలా ఎన్నో పాత్రలను నేను ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశా” అని తెలిపింది.