టీడీపీలో చేరిన కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్

  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్
  • ఆయనతో పాటు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అనుచరులు కూడా చేరిన వైనం
  • టీడీపీ గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్న చంద్రబాబు
కృష్ణా జిల్లాలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో వీరికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీని కాపాడటం టీడీపీతో సాధ్యమని నమ్మి తమతో కలసి పని చేయడానికి వచ్చిన సుభాష్ చంద్రబోస్ ను అభినందిస్తున్నానని చెప్పారు. సుభాష్ తో పాటు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో అనుచరులు చేరడం పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని... టీడీపీ గెలుపు రాష్ట్ర గెలుపు అని చెప్పారు. 

హైదరాబాద్ మాదిరి అమరావతిని అభివృద్ధి చేయాలని తాను తపించానని... అయితే గత ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో అంతా తారుమారు అయిందని అన్నారు. అమరావతి పూర్తి అయివుంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. మూడు రాజధానులు అంటూ అమరావతి నిర్మాణాన్ని జగన్ పక్కన పెట్టేశారని విమర్శించారు.


More Telugu News