ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరీ భద్రత

  • నేటి రాత్రే ఉత్తర్వుల జారీ
  • ఈటలను కలిసి వివరాలు సేకరించిన మేడ్చల్ డీసీపీ
  • నివేదిక ఆధారంగా వై కేటగిరీ భద్రత
బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ కు వై కేటగిరీ భద్రతను కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల భార్య జమున, అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి విదితమే. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటలకు ప్రాణహాని ఉందంటే తాను స్పందిస్తానని, ఆయన తనకు సోదరుడి లాంటివాడని, ఆయనకు భద్రతపై తాను స్వయంగా మాట్లాడుతానని కూడా చెప్పారు.

ఈ క్రమంలో మేడ్చల్ డీసీపీ సందీప్ నిన్న ఈటలను కలిసి, వివరాలు సేకరించారు. ఆయన సీల్డ్ కవర్ లో డీజీపీకి నివేదికను సమర్పించారు. నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వై కేటగిరీ నేపథ్యంలో ఈటలకు ఐదుగురు అంగరక్షకులు నిత్యం ఉంటారు. మరో ఆరుగురు అంతర్గత భద్రతా సిబ్బంది షిఫ్ట్ కు ఇద్దరు చొప్పున మూడు షిఫ్ట్‌లలో ఉంటారు.


More Telugu News