లింగమనేని ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లించారా... ఆధారాలు ఏవి?: సజ్జల

  • లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు ఏసీబీ కోర్టు ఆదేశాలు
  • ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్న టీడీపీ
  • చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని వెల్లడి
  • అవకతవకలు జరగకపోతే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారన్న సజ్జల
అమరావతి ప్రాంతంలోని కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసేందుకు ఏపీ సీఐడీకీ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.  

జప్తు వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం లేదని, తాను నివసిస్తున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని టీడీపీ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

లింగమనేని గెస్ట్ హౌస్ కు చంద్రబాబు అద్దె చెల్లిస్తుంటే, అందుకు తగిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య ఏం అగ్రిమెంట్ జరిగిందో మీడియా ముందుకు వచ్చి చెప్పాలని నిలదీశారు. 

చంద్రబాబు నివాసం విషయంలో ఒక పరిశోధన సంస్థ (సీఐడీ) సమర్పించిన ప్రాథమిక ఆధారాలతోనే కోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందని, అందుకే జప్తునకు అనుమతి ఇచ్చిందని సజ్జల వివరించారు. నోరు ఉంది కదా అని మాట్లాడితే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? అని వ్యాఖ్యానించారు. లింగమనేని గెస్ట్ హౌస్ అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని భావిస్తే టీడీపీ ఎందుకు భయపడుతున్నట్టు అని సజ్జల ప్రశ్నించారు. 

రాజకీయ కక్షసాధింపు చర్యలు అని టీడీపీ నేతలు ఆరోపిస్తుండడం అర్థరహితమని కొట్టిపారేశారు. జగన్ గనుక కక్ష సాధించాలని అనుకుని ఉంటే, అధికారంలోకి రాగానే కేసుల్లో ఇరికించి లోపల వేసేవాడని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కుంభకోణానికి సంబంధించి లింగమనేని గెస్ట్ హౌస్ వ్యవహారం చాలా చిన్నదని తెలిపారు.


More Telugu News