ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు: రేవంత్ రెడ్డి

  • భట్టి పీపుల్స్ మార్చ్ తెలంగాణ సమాజం కోసమన్న టీపీసీసీ చీఫ్
  • పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అని వ్యాఖ్య
  • బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత వాహనాల్లో సభకు రావాలని పిలుపు
మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ కోసం కాదని, తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని, ఈస్ట్‌మన్ కలర్ లో ప్రజలకు చూపిస్తున్న భ్రమలను మల్లుభట్టి ఈ పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టికి తెచ్చారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుందన్నారు. ఆయన శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లంపాడులో భట్టిని కలిశారు.

అనంతరం మాట్లాడుతూ... ఖమ్మంలో జన గర్జన సభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు వచ్చామని, సభ ఏర్పాట్లపై భట్టి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. జులై 2న జరిగే సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారని, ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సభకు కార్యకర్తలు తరలి వస్తారన్నారు. ఈ సభ ఏర్పాట్లను పొంగులేటి పకడ్బందీగా చూస్తున్నారన్నారు.

సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులను అడిగారని, మొదట బస్సులు ఇస్తామని చెప్పిన ఆర్టీసీ అధికారులు, ఆ తర్వాత ఇవ్వలేమని చెబుతున్నారని ఆరోపించారు. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత వాహనాల్లో సభకు రావాలని, ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించేలా కాంగ్రెస్ సభను పొంగులేటి నిర్వహిస్తారని, బీఆర్ఎస్ నేతలు కావాలంటే సభలో తలలు లెక్కపెట్టుకోవచ్చునన్నారు. ఖమ్మం సభ నుండే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమాధి కడతామన్నారు.


More Telugu News