కాంగ్రెస్ పాలనపై కథ చెప్పిన కేటీఆర్!

  • మహబూబాబాద్‌లో పోడు పట్టాలు పంపిణీ చేసిన కేటీఆర్
  • రోడ్లు బాగు చేయలేదని, నీళ్లు రాలేదని భట్టి చేస్తున్న విమర్శలపై మండిపాటు
  • 50 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని ప్రశ్న
పోడు భూములకు పట్టాలు మాత్రమే కాదు.. రైతు బంధు, రైతు బీమా కూడా అందుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ రోజు మహబూబాబాద్‌లో పోడు పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. జిల్లాలో 24,281 మంది రైతులకు 67,730 ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్కపై కేటీఆర్ మండిపడ్డారు. రోడ్లు బాగు చేయలేదని, నీళ్లు రాలేదని భట్టి చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఓ కథ చెప్పి సెటైర్ వేశారు.

‘‘మహబూబాబాద్‌ లాంటి ఒక ఊర్లోనే.. ఓ పిల్లగాడు ఉండేవాడు. సదువు సంధ్య ఏదీ లేకుండా తిరిగేటోడు.. చెడు తిరుగుళ్లకు అలవాటు పడి తాగుడుకు బానిసయ్యాడు. డబ్బుల కోసం తండ్రి జేబులో డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాడు. చూసి, ప్రశ్నించిన తల్లిని రోకలితో కొట్టి చంపాడు. తర్వాత చూసిన తండ్రినీ చంపాడు” 

‘‘తల్లిదండ్రులను చంపితే పోలీసులు ఊరుకోరు కదా.. అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ‘సొంత తల్లిదండ్రులను చంపావు. నీకు ఏం శిక్ష విధించాలో నువ్వే చెప్పు’ అని జడ్జి అడిగారు. అప్పుడు అతడు.. ‘తల్లీ తండ్రి లేని అనాథను. నన్ను విడిచిపెట్టండి’ అని అన్నాడట. అట్లుంది కాంగ్రెస్ కథ” అని కేటీఆర్ కథ ముగించారు. 

‘‘తల్లీ తండ్రిని చంపినోడే ‘నేను అనాథ’ అంటాడు. నిన్న మొన్నటి దాకా 50 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఎవరు? కాంగ్రెస్ వాళ్లు కాదా? మళ్లీ వాళ్లే వచ్చి ఇది ఇట్లెందుకుంది? అది అట్లెందుకుంది? అని ప్రశ్నించడమేంటి? 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?” అని మండిపడ్డారు.


More Telugu News