బాబు లబుషేన్.. ఇదేం పని సామీ!

  • ఆసీస్, ఇండ్లండ్ మధ్య కొనసాగుతున్న యాషెస్ రెండో టెస్ట్
  • బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లబుషేన్ నోటి నుంచి జారిపడ్డ చూయింగ్ గమ్
  • కింద పడినా తీసుకుని మళ్లీ నోట్లోకి వేసుకున్న మార్నస్.. వీడియో వైరల్
మార్నస్ లబుషేన్.. ప్రపంచ క్రికెట్‌లో మేటి బ్యాట్స్‌మెన్స్‌లో ఒకడు. అయితే కాస్త ఆసక్తికర క్యారెక్టర్ కూడా. బ్యాటింగ్‌కు ముందు కుర్చీలోనే హాయిగా కునుకు తీస్తాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లను తన తుంటరి పనులతో కవ్విస్తుంటాడు. ఇక ఫీల్డ్‌లో ఉన్నంతసేపు నోటిలో చూయింగ్‌గమ్ ఉండాల్సిందే. ఎప్పుడూ నములుతూనే ఉంటాడు. ఈ క్రమంలో అతడు చేసిన పని వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బబుల్‌ గమ్ పడిపోయింది. అతడు తన గ్లోవ్స్‌ను సరి చేసుకుంటున్న సమయంలో నోటి నుంచి జారిపోయింది.

క్షణం కూడా ఆలోచించకుండా.. అతడు కింద పడిపోయిన చూయింగ్‌ గమ్‌ను తీసుకుని మళ్లీ నోట్లోకి వేసుకున్నాడు. దానికి మట్టి ఏమైనా అంటుకుందా? బాగానే ఉందా? అనేవేదీ చూసుకోలేదు. చూయింగ్‌గమ్‌ను మళ్లీ నములుకుంటూ గ్లోవ్స్ సరి చేసుకున్నాడు. ఇదంతా కెమెరాలు రికార్డు చేశాయి. దీంతో వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇక యాషెస్‌లో తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. రెండో టెస్టు కూడా హోరాహోరీగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ సెంచరీ చేయగా.. వార్నర్, హెడ్, లబుషేన్ రాణించారు. 416 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 278 పరుగులు చేసింది. డకెట్ 98 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. జాక్ క్రాలే, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ రాణించారు.


More Telugu News