జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్‌పై స్పందించిన ఈటల రాజేందర్!
- ఆ ట్వీట్ అర్థమేంటో జితేందర్ రెడ్డినే అడగాలన్న ఈటల
- ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్య
- ఏది పడితే అది చేయడం మంచిది కాదని హితవు
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ ఆజ్యం పోసింది. ట్రాలీలోకి ఎక్కకుండా సతాయిస్తున్న దున్నపోతు తోక మెలితిప్పి, తంతున్న వీడియోను జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ ఆయన పెట్టిన కామెంట్.. టీబీజేపీలో కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో జితేందర్ ట్వీట్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఆ ట్వీట్ ఏంటో, దానికి అర్థమేంటో జితేందర్ రెడ్డినే అడగాలని అన్నారు. వయసు, అనుభవం పెరిగిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఈటల చెప్పారు. ఏది పడితే అది చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించకూడదని, ఈ విషయాన్ని బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాలని అన్నారు.