సిలిండర్ల ఇత్తడి వాల్వ్‌లు దొంగిలించే యత్నంలో అమ్మోనియా లీక్.. 15 మందికి అస్వస్థత

  • సనత్‌నగర్ పరిధిలోని ఫతేనగర్‌లో ఘటన
  • వాంతులు, కళ్లమంటలు, ఊపిరాడక ఇబ్బంది పడిన స్థానికులు
  • బాధితులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలోని ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డులో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ రోడ్డు చివర్లో ఉన్న చెత్తకుప్పల్లో గ్యాస్ కటింగ్‌కు ఉపయోగించే రెండు సిలిండర్లు చాలాకాలంగా అక్కడే పడి వున్నాయి. నిన్న సాయంత్రం అటువైపుగా వచ్చిన ఓ దొంగ వాటిని గమనించి వాటికుండే ఇత్తడి వాల్వ్‌లను దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వాటిని రాడ్డుతో కొట్టడంతో అవి పగిలి అందులోని అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో భయపడిన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. 

మరోవైపు, సిలిండర్ల నుంచి లీకైన గ్యాస్ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న 10 మంది బీహారీ కార్మికులు అది పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడిన వారంతా వాంతులు చేసుకున్నారు. సమీపంలోని బస్తీలో నివసించే మరో ఐదుగురు వాంతులు, కళ్ల మంటలతో ఇబ్బందికి గురయ్యారు. బాధితులను స్థానికులు వెంటనే బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News