తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేసిన రాష్ట్ర గవర్నర్

  • తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై కేసులు
  • ఈ నెల 14న మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ
  • మంత్రిగా కొనసాగితే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందన్న గవర్నర్
  • అందుకే సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటన
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ఎక్సైజ్, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి బర్తరఫ్ చేశారు. క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తున్నట్టు రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. 

క్యాష్ ఫర్ జాబ్ వ్యవహారంలో మనీలాండరింగ్ అభియోగాలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ నెల 14న అరెస్ట్ చేశారు. మంత్రి అరెస్ట్ ను సీఎం స్టాలిన్ సహా ఇతర మంత్రిమండలి సభ్యులు ఖండించారు. 

తాజాగా గవర్నర్ చర్య, సెంథిల్ ను తప్పించడానికి గల కారణాలతో రాజ్ భవన్ వెలువరించిన ప్రకటన డీఎంకే ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి.

"మంత్రి సెంథిల్ బాలాజీ అనేక అవినీతి కేసులకు సంబంధించి క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్నారు. వాటిలో క్యాష్ ఫర్ జాబ్, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. సెంథిల్ బాలాజీ మంత్రి పదవిలో ఉంటే కేసుల విచారణను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. శాంతిభద్రతలకు అది ఏమంత క్షేమకరం కాదు. 

ఈడీ విచారిస్తున్న ఓ కేసులో ఆయన ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరికొన్ని అవినీతి కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. వీటిని రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సెంథిల్ బాలాజీ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగడం కేసుల విచారణ రీత్యా సమంజసం కాదు. 

మంత్రిగా ఆయన కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నానికి దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో, సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి గవర్నర్ డిస్మిస్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది" అంటూ రాజ్ భవన్ ప్రకటన వెలువరించింది.


More Telugu News