ప్రజల్లో అసంతృప్తి గుర్తించాకే దీనిని తెరపైకి తెచ్చారు: ఉమ్మడి పౌర స్మృతిపై శరద్ పవార్ వ్యాఖ్యలు

  • వాతావరణం తమకు అనుకూలంగా లేదనే బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెచ్చిందన్న పవార్ 
  • సిక్కులు, జైనులు, క్రిస్టియన్ వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాల్సి ఉందన్న పవార్
  • ముందు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని సూచన
ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం ఆరోపించారు. దేశంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా లేనందున ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ యూసీసీ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ అంశాన్ని కేంద్రం లా కమిషన్ కు నివేదించిందని, కమిషన్ వివిధ వర్గాలు, సంస్థల నుండి ప్రతిపాదనలను కోరిందన్నారు.

ఇప్పటి వరకు లా కమిషన్ కు 900 ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో ఏముందనేది తనకు తెలియదన్నారు. ఈ ప్రతిపాదనలను కమిషన్ బహిర్గతం చేయలేదన్నారు. ఇక ఉమ్మడి పౌర స్మృతిపై సిక్కులు, జైనులు, క్రిస్టియన్ వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాల్సి ఉందన్నారు. సిక్కులు దీనిపై భిన్న వైఖరితో ఉన్నట్లు చెప్పారు. ఈ వర్గం వైఖరిని విస్మరించరాదన్నారు. ఉమ్మడి పౌర స్మృతి కంటే ముందు లోక్ సభలో, శాసన సభలలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పవార్ సూచించారు.


More Telugu News