కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో... జులై 3న కేబినెట్ భేటీ

  • ఈ భేటీకి కేంద్రమంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులు హాజరు 
  • జులై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
  • ఈ ఏడాది చివరలో కీలక అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు
  • ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీపై ఆసక్తి
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జులై 3న కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ హాలులో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర మంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులు హాజరు కానున్నారు. లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేనందున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అలాగే, జులై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని రోజుల ముందు మంత్రి మండలి సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది చివరలో కీలకమైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని మోదీ నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు.


More Telugu News