ఎన్నికలు వస్తే ఓడిపోతామనే ఓట్లు తొలగిస్తున్నారు: చంద్రబాబు

  • రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లు నమోదుచేస్తున్నారన్న టీడీపీ నేతలు
  • ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
  • ఓటర్ల జాబితా అవకతవకలపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం
  • స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరిన్ని ఆధారాలు సేకరించాలన్న చంద్రబాబు
రాష్ట్రంలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ నేతలు పలుమార్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. నిన్న కూడా టీడీపీ బృందం సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు విజ్ఞాపన పత్రం అందించింది. 

ఈ నేపథ్యంలో, ఓటర్ల జాబితా అవకతవకలపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో నేడు సమావేశం నిర్వహించారు. పార్టీ యంత్రాంగం గుర్తించిన వాటిని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు 20 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించామని టీడీపీ నేతలు వెల్లడించారు. 

పార్టీ పరంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరిన్ని ఆధారాలు సేకరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా అక్రమాలపై నిరంతర పోరాటం చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే ఓడిపోతామనే అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News