అమెరికన్లపై గూఢచర్యానికి అమెరికా టెక్నాలజీనే ఉపయోగించిన చైనా!

  • ఫిబ్రవరిలో అమెరికా గగనతలంపై చైనా బెలూన్
  • బెలూన్ ను కూల్చివేసిన అమెరికా యుద్ధ విమానాలు
  • ఇది నిఘా బెలూన్ అంటూ అమెరికా ఆరోపణలు
  • వాతావరణ పరిశీలన బెలూన్ అంటూ చైనా వాదన
  • బెలూన్ ను పరిశీలించిన అమెరికా నిపుణులు
ఈ ఏడాది మొదట్లో చైనా బెలూన్ అమెరికా గగనతలంలో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెలూన్ ను అమెరికా వాయుసేన విమానాలు కూల్చివేశాయి. అమెరికాపై నిఘా వేసేందుకు చైనా ఈ బెలూన్ ను ప్రయోగించిందని వైట్ హౌస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ బెలూన్ కు సంబంధించి తాజాగా ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ చైనా బెలూన్ లో ఉపయోగించింది అమెరికా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానమే అని గుర్తించారు. అత్యంత నాణ్యతతో మాటలు, దృశ్యాలు రికార్డింగ్ చేయగల పరికరాలు ఈ బెలూన్ లో ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ అమెరికా పరికరాలు వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యమయ్యేవేనని వెల్లడించింది. 

అయితే దీనికి చైనా ప్రత్యేకంగా తయారుచేసిన సెన్సర్లను జోడించిందని... సేకరించిన ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని చైనాకు పంపించే ఏర్పాట్లు ఈ బెలూన్ లో ఉన్నాయని వివరించింది. 

చైనా చెబుతున్నట్టు ఇది వాతావరణ పరిశీలనకు ఉద్దేశించిన బెలూన్ కానేకాదని, ఇది నిఘా అవసరాల కోసం రూపొందించిన బెలూన్ అని అమెరికా రక్షణ శాఖ గుర్తించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. 

అయితే, ఈ బెలూన్ అలస్కా, కెనడా మీదుగా సాగించిన 8 రోజుల ప్రస్థానంలో ఎలాంటి డేటాను చైనాకు పంపలేదని నిపుణుల పరిశీలనలో తేలిందని వెల్లడించింది.


More Telugu News