ఆసుపత్రి నెంబర్ అని ఫోన్ చేస్తే రూ.99 వేలు పోయాయి!

  • సైబర్ మోసానికి బాధితుడిగా మిగిలిన గుజరాత్ రైతు
  • అనారోగ్యానికి గురైన రైతు మేనల్లుడు
  • ఆన్ లైన్ లో అపాయింట్ మెంట్ బుక్ చేసేందుకు రైతు ప్రయత్నం
  • అవతలి వ్యక్తులు పంపిన లింక్ క్లిక్ చేయగా ఖాతాకు చిల్లు పడిన వైనం
ఆన్ లైన్ లో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ఓ ఆసుపత్రి ఫోన్ నెంబర్ వెదికి డయల్ చేసిన రైతు రూ.99 వేలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతానికి చెందిన ఓ రైతు సైబర్ నేర బాధితుడయ్యాడు. 

మలియా హతీనా తాలూకా సమధియాలా గిర్ గ్రామానికి చెందిన ప్రఫుల్ భర్దా ఓ రైతు. భర్దా మేనల్లుడు ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. కేశోద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆ యువకుడు భర్దాను కోరాడు. దాంతో భర్దా మేనల్లుడి కోసం ఆన్ లైన్ లో కేశోద్ లో ఉన్న ఆసుపత్రుల వివరాలు వెదికాడు. 

ఓ ఫోన్ నెంబర్ కనిపించడంతో వెంటనే కాల్ చేశాడు. అవతలి వ్యక్తి తాను ఆసుపత్రి రిసెప్షనిస్ట్ అని పరిచయం చేసుకున్నాడు. తన మేనల్లుడికి ఆరోగ్యం బాగాలేదని, ఓపీ రాయాలని భర్దా కోరాడు. దాంతో అవతలి వ్యక్తి ఆన్ లైన్ లో రూ.5 చెల్లించి డాక్టర్ అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలని సూచించాడు. ఫోన్ కు ఓ లింకు పంపిస్తామని, దాంట్లో రోగి వివరాలు నమోదు చేయాలని తెలిపాడు.

అది నిజమేనని నమ్మిన రైతు తన మేనల్లుడి వివరాలు పొందుపరిచి, ఆన్ లైన్ లో రూ.5 చెల్లించాడు. ఆ తర్వాత రోజు భర్దా ఫోన్ కు బ్యాంకు నుంచి ఓ సందేశం వచ్చింది. మీ ఖాతా నుంచి రూ.99 వేలు డెబిట్ చేయబడ్డాయి అన్నదే ఆ సందేశం యొక్క సారాంశం.

దాంతో లబోదిబోమన్న ఈ రైతు తాను మోసపోయానని గుర్తించాడు. వెంటనే తన బ్యాంకు ఖాతాను బ్లాక్ చేసి, బ్యాంకు అధికారుల సలహా మేరకు సైబర్ మోసం కింద ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రైతు ప్రఫుల్ భర్దా ఖాతా నుంచి ఓ ప్రైవేటు బ్యాంకు అకౌంట్ కు నగదు బదిలీ అయినట్టు తెలుసుకున్నారు. ఆ నగదును ఓ ఏటీఎమ్ ద్వారా డ్రా చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.


More Telugu News