సాయిచంద్ మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టిన కేటీఆర్

  • సాయిచంద్‌కు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, దేశపతి శ్రీనివాస్ నివాళులు
  • ఉద్యమ సమయంలో తన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించాడని గుర్తు చేసుకున్న కేటీఆర్
  • హైదరాబాద్ లోనే ఉండి ఉంటే బతికేవారేమోనన్న మంత్రి
బీఆర్ఎస్ నేత, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతదేహాన్ని చూసిన మంత్రి కేటీ రామారావు కంటతడి పెట్టారు. సాయిచంద్ మృతదేహానికి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో కేటీఆర్ కంటతడి పెట్టారు. కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో తన అరుదైన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయిచంద్ మరణం చాలా బాధాకరమన్నారు.

ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు అన్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉండి ఉంటే బతికేవారేమోనని, స్వగ్రామానికి వెళ్లడం, అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.
ఆయన కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధేస్తోందని, వారిని ఎంత ఓదార్చినా... సర్దిచెప్పే పరిస్థితి తమకు ఎవరికీ లేదని కంటతడి పెట్టారు. సాయిచంద్ కుటుంబాన్ని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.

సాయిచంద్ లేడని ఊహించికుంటేనే చాలా బాధగా ఉందని, చిన్నవయస్సులోనే చనిపోవడం దురదృష్టకరమన్నారు. అతను నిజాయతీ కలిగిన సైనికుడన్నారు. సాయిచంద్ పాట ఖండాంతరాలు దాటిందని, తన మనసుకు దగ్గరైన వ్యక్తి అనీ అన్నారు. సాయిని మళ్లీ తిరిగి తెచ్చుకోలేమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. తన మాటలు, పాటలతో బీఆర్ఎస్ సభలను సాయిచంద్ విజయవంతం చేశాడని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుడిగాలిలా వచ్చి ఎన్నో పాటలు పాడాడని దేశపతి శ్రీనివాస్ అన్నారు.


More Telugu News