భారత సర్కారు చర్యలతో విలవిల్లాడుతున్న చైనా కంపెనీ షావోమీ!

  • తగ్గిపోతున్న మార్కెట్ వాటా
  • దర్యాప్తు సంస్థల విచారణతో ఇబ్బందులు
  • ఒక వంతు ఉద్యోగులపై వేటు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షోవోమీ ఇండియా భారత సర్కారు కఠిన చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మార్కెట్ వాటా పడిపోతుండడం, మరోవైపు పన్ను ఎగవేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో ఉద్యోగులను తగ్గించుకుని, వ్యయాన్ని తగ్గించుకునే పనిలో పడింది. 

ఈ సంస్థకు 2023 జనవరి నాటికి 1400-1500 మంది వరకు ఉద్యోగులు ఉండగా, గత వారం 30 మందిని తొలగించింది. అంతేకాదు పునర్ వ్యవస్థీకరణ పేరుతో మొత్తం ఉద్యోగులను 1,000 మంది లోపుకు తగ్గించుకోనున్నట్టు తెలుస్తోంది. రానున్న నెలల్లో మరింత మందిని తగ్గించుకోనుంది.

 నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంగా షావోమీ చెబుతోంది. పనితీరు మెరుగు పరుచుకోవాలనే ప్రణాళికను సంస్థ రూపొందించింది. దీనికింద ఎవరైతే మెరుగైన పనితీరు చూపించలేకపోయారో, వారిపై వేటు వేయనుంది. ఏ కంపెనీ అయినా మార్కెట్, వ్యాపార పరిస్థితుల ఆధారంగానే ఉద్యోగులపై నిర్ణయం తీసుకుంటుందని షావోమీ స్పష్టత నిచ్చింది. 

షావోమీ ఇండియా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో కేవలం 50 లక్షల ఫోన్లను మార్కెట్ కు సరఫరా చేసింది. 2022 మొదటి మూడు నెలల్లో ఇలా షిప్ చేసిన యూనిట్లు 70-80 లక్షలుగా ఉన్నాయి. వరుసగా 20 నెలల పాటు భారత మార్కెట్లో నంబర్ 1 స్థానంలో ఉన్న షావోమీ ఇప్పుడు 16 శాతం వాటాతో శామ్ సంగ్, వివో తర్వాతి స్థానానికి దిగిపోయింది. విదేశీ మారకద్రవ్య చట్టం కింద రూ.5551 కోట్ల మేరకు షావోమీ ఇండియా, దాని అధికారులకు ఈడీ షోకాజు నోటీసులు జారీ చేయడం తెలిసిందే.


More Telugu News