విస్తరిస్తున్న రుతుపవనాలు... కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

  • గత 24 గంటల్లో దేశంలోని ఇతర భాగాలకు వ్యాపించిన రుతుపవనాలు
  • రుతుపవనాల గమనానికి పరిస్థితులు అనుకూలమన్న ఐఎండీ
  • జులై 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు
దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా సమాచారం వెలువరించింది. గడచిన 24 గంటల్లో రుతుపవనాలు దేశంలోని మరిన్ని భాగాలకు వ్యాపించాయని, రుతుపవనాల గమనానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో ఉత్తర మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఆవరించి ఉందని వివరించింది. 

ఈ నేపథ్యంలో, కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది. జులై 2, 3 తేదీల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో వాతావరణం చాలావరకు పొడిగానే ఉంటుందని పేర్కొంది. దక్షిణాదిన కేరళ, కర్ణాటక కోస్తా జిల్లాల్లో రాగల 5 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.


More Telugu News