నిద్ర పట్టాలంటే జో బైడెన్ ఈ మెషిన్ పెట్టుకోవాల్సిందే!

  • స్లీప్ ఆప్నియా సమస్యతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు
  • వైద్యుల సూచన మేరకు సీపాప్ మెషిన్ ధారణ
  • దీనివల్ల శ్వాస మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆయన వయసు 80 ఏళ్లు. సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ అప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీని వల్ల గురక వస్తూ నిద్ర సరిగా పట్టదు. దాంతో గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వైద్యుల సూచన మేరకు జో బైడెన్ ‘ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెషర్’ (సీపాప్) మెషిన్ ను ముఖానికి ధరించి నిద్ర పోతున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రకటించింది.

తనకు 2008 నుంచి స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించడం గమనార్హం. ఇది తీవ్రమైన సమస్య. దీని కారణంగా మధ్య మధ్యలో శ్వాస తీసుకోవడం ఆపేసి, ఒక్కసారిగా తీసుకుంటూ ఉంటారు. మంగళవారం రాత్రి సీపాప్ మెషిన్ ను బైడెన్ ధరించి పడుకోగా, ఆ మచ్చలు ముఖంపై కనిపించాయి. జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అధిక హార్ట్ బీట్ రావడంతో స్లీప్ ఆప్నియాగా వైద్యులు అనుమానించారు. కానీ, సీపాప్ మెషిన్ ను ఇప్పుడే ధరించడం ప్రారంభించారు. సీపాప్ మెషిన్ ను ముఖానికి ధరించినప్పుడు అది మాస్క్ ద్వారా మన ముక్కుల్లోంచి ఎయిర్ ను పంప్ చేస్తుంది. దాంతో గాలి తీసుకునే వాయు మార్గాలు తెరుచుకుంటాయి. మెరుగైన శ్వాస ఆడుతుంది. అమెరికాలో 50 లక్షల మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు.


More Telugu News