అహ్మదాబాద్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్.. హోటల్ గదికి ఒక్క రోజు అద్దె రూ.లక్ష!

  • అక్టోబర్ 5న భారత్-పాకిస్థాన్ మధ్య వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహణ
  • ఒకేసారి పది రెట్లు పెరిగిన హోటళ్ల గది అద్దెలు
భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు టీవీల ముందు వాలిపోతారు. మ్యాచ్ జరిగే స్టేడియంలో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొంటాయి. వన్డే ప్రపంచకప్ 2023 లో తొలి మ్యాచ్ ఈ రెండు దాయాది దేశాల మధ్యే జరుగుతుండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. అహ్మదాబాద్ వేదికను మార్చాలంటూ పాకిస్థాన్ ఐసీసీపై తీవ్ర ఒత్తిడి కూడా తీసుకువచ్చింది. అయినా పాక్ మాట నెగ్గలేదు. దీంతో చివరికి అహ్మదాబాద్ స్టేడియంలోనే రెండు జట్లు ముఖాముఖి తేల్చుకోనున్నాయి.

మరి ఈ మ్యాచ్ కోసం అభిమానుల నుంచి ఫుల్ డిమాండ్ నెలకొంది. ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు అహ్మదాబాద్ లోని ప్రముఖ హోటళ్లు గదుల అద్దెలను అమాంతం భారీగా పెంచేశాయి. ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.లక్షకు చేరిపోయింది. హోటల్ బుకింగ్ ల సైట్లు పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమవుతోంది. సాధారణంగా హోటల్ రూమ్ ల ధరలు డైనమిక్ ప్రైసింగ్ విధానంతో ఉంటాయి. ఎక్కువ మంది హోటల్ రూమ్ చార్జీలు తెలుసుకుంటున్నా, బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినా వాటి ధరలు ఆటోమేటిగ్గా పెరిగిపోతుంటాయి. 

అభిమానుల నుంచి డిమాండ్ పెరగడంతో హోటళ్ల యాజమాన్యాల్లో లాభాల ధోరణి పెరిగింది. రూమ్ రెంట్ లు ఒకేసారి పది రెట్లు పెరిగి రూ.లక్షకు చేరాయి. ఇప్పటికే కొన్ని హోటళ్లలోని గదులన్నీ బుక్ అయ్యాయి. సాధారణ హోటళ్లలోనూ ఒక రోజుకు గది అద్దె రూ.5,000-8,000 నుంచి రూ.40,000 వరకు పెరిగింది. ఐటీసీ హోటల్స్ కు చెందిన వెల్ కమ్ హోటల్ లో సాధారణ రోజు అద్దె రూ.5,699గా ఉంటే, మ్యాచ్ జరిగే రోజున రూ.71,999కు పెరిగిపోయింది. రినైసెన్స్ అహ్మదాబాద్ హోటల్ లోనూ గది అద్దె రూ.8,000 నుంచి రూ.90,679కు పెరిగిపోయింది.


More Telugu News