రాత్రి ఉగ్రవాదం.. పగలు వాణిజ్యం: పాక్ పై జైశంకర్ మండిపాటు

  • పాక్ ఉగ్రవాద చర్యలను అనుమతించేది లేదన్న విదేశాంగ మంత్రి 
  • అందుకే సార్క్ భేటీలు జరగడం లేదని వెల్లడి   
  • చర్చించుకోవాల్సిన తీవ్రమైన అంశాలున్నాయన్న జైశంకర్  
పాకిస్థాన్ విధానాన్ని భారత విదేశాంగ మంత్రి తప్పుబట్టారు. రాత్రి ఉగ్రవాదం నడిపించే దేశంతో పగలు వాణిజ్యం చేయలేమని తేల్చి చెప్పేశారు. ఒక సభ్య దేశం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత వరకు సార్క్ దేశాల శిఖరాగ్ర సమావేశం సాధ్యం కాదన్నారు. ఇటీవలి కాలంలో సార్క్ దేశాల భేటీ ఎందుకు జరగడం లేదంటూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా జైశంకర్ ప్రశ్న ఎదుర్కొన్నారు. 

‘‘సార్క్ గురించి మనం పెద్దగా వినట్లేదు. గత కొన్నేళ్ల నుంచి దీని గురించి పెద్దగా చర్చించుకోవడం లేదు. మేము సమావేశాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే ఓ సభ్య దేశం అన్ని ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు. సార్క్ భేటీకి నేడు ఉన్న వాస్తవ అవరోధం ఇదే. ఉగ్రవాద చర్యలతో కొనసాగడం సాధ్యం కాదని నేను చెప్పడం గుర్తుండే ఉంటుంది’’ అని జైశంకర్ వివరించారు.

‘‘సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల తీవ్రతను గుర్తించాల్సిన సమయం ఇది. రాత్రి ఉగ్రవాదం, పగలు వాణిజ్యానికి అనుమతించేది లేదు. దీనివల్ల దేశానికి మేలు జరుగుతుందని నేను అనుకోవడం లేదు’’ అని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. సార్క్ అన్నది భారత్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ తో కూడిన సమూహం.


More Telugu News