తీరానికి టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు.. దర్యాప్తులో కీలక పురోగతి

  • టైటానిక్ శకలాలు చూసేందుకు వెళ్లి పేలిపోయిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్
  • అందులోని ఐదుగురూ మృత్యువాత
  • శకలాల్లో చనిపోయిన వారి అవశేషాలు ఉండే అవకాశం ఉందన్న అమెరికా కోస్టుగార్డు
అట్లాంటిక్ మహాసముద్రంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన సబ్‌మెర్సిబుల్ ‘టైటాన్’ శకలాలను తీరానికి తీసుకొచ్చారు. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్ అండ్ లాబ్రాడార్ ఫ్రావిన్సులోని సెయింట్ జాన్స్‌ ఓడరేవుకు నిన్న వాటిని తీసుకొచ్చారు. మొత్తం ఐదుగురితో ప్రయాణమైన టైటాన్.. తీరం నుంచి బయలుదేరిన రెండు గంటల్లోపే పేలిపోయింది. దీంతో అందులోని ఐదుగురూ మృత్యువాత పడ్డారు. 

జలాంతర్గామి పేలిపోవడానికి గల కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలక పరిణామమని అమెరికా కోస్టుగార్డు అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకుండా చూసుకోవడంలో ఇది సాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వెలికి తీసుకొచ్చిన సబ్‌మెర్సిబుల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి అవశేషాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.


More Telugu News