మధ్యప్రదేశ్ సీఎంకు వ్యతిరేకంగా ఫోన్‌పే లోగోతో పోస్టర్లు.. కాంగ్రెస్‌పై సంస్థ గుస్సా

  • ముఖ్యమంత్రి వ్యతిరేక నిరసనల్లో లోగోతో పోస్టర్లు  
  • తమ లోగో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్‌పే హెచ్చరిక
  • తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని వ్యాఖ్య
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వ్యతిరేక నిరసనల్లో తమ లోగో వినియోగించడంపై ఫోన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా తమ లోగోను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయం హీటెక్కింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను టార్గెట్ చేసుకుంది. ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందంటూ భోపాల్‌ నగర వీధుల్లో పోస్టర్లు ఏర్పాటు చేసింది. ఇందులో ఫోన్‌పే లోగోను పోలిన డిజైన్ వినియోగించింది. క్యూఆర్ కోడ్ మధ్యలో శివరాజ్ సింగ్ ఫొటోతో పాటూ పని జరగాలంటే 50 శాతం కమిషన్ ఇవ్వాలంటూ పోస్టర్లు డిజైన్ చేయించింది. 

దీనిపై ఫోన్‌పై సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. పోస్టర్ల నుంచి తమ సంస్థ లోగోను తక్షణం తొలగించాలని డిమాండ్ చేసింది. రాజకీయ, రాజకీయేతరులు ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోన్‌పే లోగోను వాడకూడదని హెచ్చరించింది. తమకు ఏ రాజకీయ పార్టీతో లేదా ప్రచార కార్యక్రమాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. 

కాగా, ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే తరహా పోస్టర్లు కనిపించాయి. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పేసీఎం పేరిట పోస్టర్లు ఏర్పాటు చేసింది.


More Telugu News