బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ క్లారిటీ

  • బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తల్లో వాస్తవం లేదన్న బండి
  • అవాస్తవ లీకులకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ఆరోపణ
  • ఈటల భద్రతపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీత
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తల్లో వాస్తవం లేదన్నారు. అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారం అలవాటుగా మారిందన్నారు. ఈ విషయం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అడిగి చెబుతానన్నారు. 

ఇలాంటి అవాస్తవ లీకులకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమన్నారు. సొంత పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్క పార్టీపై కుట్రలు చేయడం అలవాటుగా మారిందన్నారు. బీజేపీ విచ్ఛిన్నానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఈటల రాజేందర్ పై దాడులు జరిగే అవకాశం ఉందనే వార్త నేపథ్యంలో దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈటల భద్రతపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. హత్య చేస్తానని చెప్పిన వ్యక్తి బహిరంగంగా ప్రెస్ మీట్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. అందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు మండలాల వారీగా నాయకులను సన్నద్ధం చేస్తున్నామన్నారు.


More Telugu News