చంద్రయాన్ 3 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన

  • జూలై 12 నుండి 19 మధ్య చంద్రయాన్ 3 ప్రయోగం
  • అన్ని పరీక్షలు పూర్తయ్యాక కచ్చితమైన తేదీ ప్రకటన
  • ఉపగ్రహ అనుసంధానం, రోవర్, ల్యాండర్ బిగింపు పనులు పూర్తి
చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. జూలై 12 నుండి 19 మధ్యన చేపట్టనున్నట్లు చెప్పారు. అయితే సాధ్యమైనంత మేర 12, 13, 14 తేదీల్లోనే లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. 

అన్ని టెస్టులు పూర్తయ్యాక కచ్చితమైన తేదీని ప్రకటిస్తామన్నారు. ఆ రోజున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చంద్రునిపైకి చంద్రయాన్ 3 దూసుకెళ్లనుందన్నారు. ఉపగ్రహం అనుసంధానం, రోవర్, ల్యాండర్ బిగింపు పనులు కూడా పూర్తయినట్లు తెలిపారు.

చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. దీనిని జీఎస్ఎల్‌వీ మార్క్ III ద్వారా ప్రయోగిస్తున్నారు. ఇది చంద్రునిపైకి వెళ్లే భారత్ కు చెందిన అత్యంత బరువైన రాకెట్. చంద్రయాన్ 1 ను 2008లో చేపట్టారు. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. 2019లో చంద్రయాన్ 2ను చేపట్టారు. ఈ రెండో మిషన్ విఫలమైంది. మునుపటి లోపాలను సవరించుకుని ఇప్పుడు చంద్రయాన్ 3ను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు.


More Telugu News