కూకట్‌పల్లిలో కుంగిన భూమి.. ఒక్కసారిగా రేగిన కలకలం

  • గౌతమ్ నగర్ కాలనీలో ఓ సంస్థ భవన నిర్మాణ పనులు
  • పనులు జరుగుతున్న స్థలానికి పక్కనే ఉన్న రోడ్డు అకస్మాత్తుగా కుంగిన వైనం
  • స్థానికుల్లో భయాందోళనలు
  • సరైన అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు జరుగుతున్నాయని కాలనీవాసుల ఆరోపణ
  • తమకు న్యాయం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు డిమాండ్
కూకట్‌పల్లిలో ఒక్కసారిగా భూమి కుంగడంతో స్థానికంగా కలకలం రేగింది. గౌతమ్ నగర్ కాలనీలోని ఓ సంస్థ భవనం నిర్మాణ పనులు చేపడుతుండగా పక్కనే ఉన్న రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. సెల్లార్ కోసం భూమి తవ్వుతున్న క్రమంలో పక్కనే ఉన్న రోడ్డు కుంగినట్టు తెలుస్తోంది. ఫలితంగా, తాము బయటకు రాలేకపోతున్నామంటూ కాలనీ వారు ఆందోళన చేపట్టారు. సరైన అనుమతులు లేకుండా సదరు సంస్థ నిర్మాణ పనులు చేపడుతోందని ఆరోపించారు. 

అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్ జరుగుతోందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు, స్థానిక కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ భారీ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులకు కనిపించట్లేదా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.


More Telugu News