హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైలు ప్రాజెక్టు: కిషన్ రెడ్డి

  • హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ రింగ్ రైలు
  • దీంతో ప్రజా రవాణాతో పాటు వస్తు రవాణా పెరుగుతుందన్న కేంద్రమంత్రి
  • రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం
తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక రీజినల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ.14 కోట్లను కేటాయించనుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. ఇదివరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం వస్తుందన్నారు. ఆయా ప్రాంతాల నుండి హైదరాబాద్ కు త్వరగా.. అలాగే సులభంగా చేరుకోవచ్చునన్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతో విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సమయంలో ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా సౌలభ్యం చాలా పెరుగుతుందన్నారు. మొత్తంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు.


More Telugu News