అమ్మఒడి సభలో సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందన

  • మన్యం జిల్లా కురుపాంలో అమ్మఒడి సభ
  • పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన సీఎం జగన్
  • తెలుగు భాష రాని వ్యక్తి సీఎంగా ఉండడం బాధాకరమన్న పవన్ 
  • తాను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగిందని వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేయడం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

వరాహి అనే లారీ ఎక్కి, ఆవేశంతో ఊగిపోతుంటాడని అన్నారు. మాట్లాడితే చాలు... చెప్పుతో కొడతా, గుడ్డలూడదీసి కొడతా అంటాడని, బూతులు మాట్లాడుతుంటాడని విమర్శించారు. నాలుగు పెళ్లిళ్లకు, నాలుగేళ్లకోసారి భార్యను మార్చడానికి పేటెంట్ హక్కులు పవన్ కే ఉన్నాయని సెటైర్ వేశారు. 

సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. భీమవరంలో పార్టీ శ్రేణులతో సమావేశంలో ఆయన సీఎం జగన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. మొదట... సీఎం జగన్ వారాహిని వరాహి అనడంపై క్లాస్ తీసుకున్నారు. 

సరిగ్గా అ, ఆ లు నేర్చుకోకపోతే వరాహికి, వారాహికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి తానే స్వయంగా అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తానని పవన్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"ఒక నియంత, కంటకుడు, తెలుగు ఉచ్చారణ రాని జగన్ వంటి వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరం. దీనికి అందరం బాధపడుతున్నాం" అని వ్యాఖ్యానించారు. 

"అమ్మఒడి కార్యక్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నేను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగింది. నేనేమీ ఊరికే చెప్పు చూపించలేదు. మనతో 24 గంటలూ తిట్టించుకోకపోతే, లేక, తిట్టించుకునేలా వెధవ పనులు చేయకపోతే మేం వైసీపీ నాయకులమే కాదు అన్నట్టుగా ఉంది వీళ్ల వైఖరి చూస్తుంటే" అని పవన్ విమర్శించారు. 

ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎందుకు ఎగరకూడదో ఈ నెల 30న కారణాలు చెబుతానని వెల్లడించారు. ధైర్యం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి రావాలని, ధైర్యం లేకపోతే రాజకీయాల్లోకి వద్దని సలహా ఇచ్చారు.


More Telugu News