పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరనున్నారో చెప్పిన ఠాక్రే

  • జులై 2న ఖమ్మంలో మల్లుభట్టి పాదయాత్ర ముగింపు సభ
  • రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ
  • అదే సభలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్న పొంగులేటి
కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. 105 రోజుల్లో 36 నియోజకవర్గాలలో, 600కు పైగా గ్రామాలలో పర్యటించారు. మొత్తం 1,221 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగినట్లు వెల్లడించారు. మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జులై 2న తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని తెలిపారు.

పీపుల్స్ మార్చ్ ను విజయవంతంగా ముగించిన భట్టిని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదే సభలో ఘనంగా సత్కరిస్తారన్నారు. ఆ సమయంలోనే పొంగులేటి పార్టీలో చేరుతారన్నారు. మల్లుభట్టి పాదయాత్ర విజయవంతమైందని, ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మల్లుభట్టికి స్వాగతం పలికే వారిలో పొంగులేటి కూడా ఉంటారన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో నిర్వహించే బహిరంగ సభపై ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటిలు సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరు చర్చించారు.


More Telugu News