బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

  • రాహుల్ ను విమర్శిస్తూ ట్వీట్ చేసిన బీజేపీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు
  • రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారన్న తేజశ్వి సూర్య
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఇటీవల రాహుల్ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రాహుల్ చాలా ప్రమాదకారి అని, వంచన, మోసపూరిత గేమ్ ఆడుతున్నాడని బీజేపీ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 120బీ, 505(2), 34ల కింద కేసు బుక్ చేశారు.

మరోవైపు దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినప్పుడే 153ఏ, 505(2) కేసులను పెడతారని చెప్పారు. రాహుల్ గాంధీ ఒక వ్యక్తా? లేక ఒక వర్గమా? అని ప్రశ్నించారు. న్యాయం కోసం తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.


More Telugu News