ఆ సీన్ షూటింగ్ తర్వాత నోటిని డెట్టాల్ తో కడుక్కున్నా: నీనా గుప్తా
- చాలా ఏళ్ల కిందట 'దిల్లగి' సీరియల్ లో నటించిన నీనా గుప్తా
- ఆ సీరియల్ లో అధర చుంబన దృశ్యంలో నటించానన్న నీనా
- ఆ రాత్రి తనకు నిద్రపట్టలేదని వెల్లడి
తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ, అంగద్ బేడీ, అనుష్క కౌషిక్ తదితరులు నటించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్ 2' రేపు విడుదల కాబోతోంది. ఈ సిరీస్ లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీనా గుప్తా మీడియాతో మాట్లాడుతూ ముద్దు సన్నివేశానికి సంబంధించి తన గత అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. చాలా ఏళ్ల కిందట 'దిల్లగి' అనే టీవీ సీరియల్ లో తాను అధర చుంబన సన్నివేశంలో పాల్గొన్నానని... ఆ రాత్రి తాను నిద్రపోలేదని చెప్పారు. మన దేశ టీవీ సీరియల్స్ చరిత్రలో అదే తొలి అధర చుంబనం సీన్ అని తెలిపారు.
ఆ సన్నివేశం సమయంలో తాను ఎంతో టెన్షన్ పడ్డానని నీనా చెప్పారు. అవతలి వ్యక్తి తన స్నేహితుడు కాదని, తన తోటి నటుడు మాత్రమేనని, అతను అందంగా ఉన్నప్పటికీ ముద్దు పెట్టడం ఇబ్బందికరమని అన్నారు. మానసికంగా, శారీరకంగా తాను సిద్ధంగా లేనప్పటికీ... ఆ సన్నివేశంలో నటించేందుకు తనను తాను కన్విన్స్ చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు, ముద్దు సన్నివేశం షూటింగ్ పూర్తయిన వెంటనే డెట్టాల్ తో నోరు కడుక్కున్నానని తెలిపారు. పరిచయం లేని వ్యక్తులకు ముద్దు పెట్టడం చాలా కష్టమని అన్నారు.