ప్రిగోజిన్ ను పుతిన్ పురుగులా నలిపేసేవాడు: బెలారస్ అధ్యక్షుడు

  • వాగ్నర్ గ్రూపును నాశనం చేయకుండా ఆపానన్న లుకషెంకో
  • తొందరపడవద్దని పుతిన్ ను హెచ్చరించినట్లు వెల్లడి
  • క్రెమ్లిన్, వాగ్నర్ గ్రూపు చర్చల్లో తన పాత్ర గురించి వివరణ
రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ వెనక్కి తగ్గకుంటే ప్రాణాలతో ఉండేవారు కాదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తాజాగా పేర్కొన్నారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వాగ్నర్ చీఫ్ ను పురుగును నలిపినట్లు నలిపేసేవాడని చెప్పుకొచ్చారు. వాగ్నర్ చీఫ్, రష్యా అధ్యక్షుడి భవనం క్రెమ్లిన్ మధ్య లుకషెంకో మధ్యవర్తిత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ప్రకటించి మాస్కో వైపు తన బలగాలను నడిపించిన ప్రిగోజిన్ ను నిలువరించింది లుకషెంకోనే. అయితే, చర్చల సందర్భంగా ఏం జరిగిందనే విషయాన్ని లుకషెంకో తాజాగా బయటపెట్టాడు.

ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటన తర్వాత వాగ్నర్ గ్రూపును నామరూపాల్లేకుండా చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నాడని లుకషెంకో చెప్పారు. రష్యాలో పరిస్థితులను అర్థం చేసుకుని తానే కల్పించుకున్నానని, తొందరపడవద్దంటూ పుతిన్ కు నచ్చచెప్పానని వివరించారు. ప్రిగోజిన్ తో మాట్లాడినప్పుడు.. క్షమించమంటూ మొదలుపెట్టిన ప్రిగోజిన్ తొలి అర్ధగంట పాటు విపరీతమైన తిట్లతో తన సమస్యలను ఏకరువు పెట్టాడని చెప్పారు. తాను సర్దిచెప్పి తిరుగుబాటును నిలువరించానని, పుతిన్ తమను చంపేస్తాడని భయాందోళనలు వ్యక్తం చేసిన ప్రిగోజిన్ కు ధైర్యం చెప్పానని లుకషెంకో పేర్కొన్నారు. బెలారస్ లో తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చేందుకు తాను సమ్మతించాక ప్రిగోజిన్ రాజీకి ఒప్పుకున్నాడని వివరించారు.


More Telugu News