ఆధార్ లో ఉన్నట్టుగా పాన్ కార్డులో మార్పులు చేసుకోవచ్చు..
- పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి
- రెండింటిలో వివరాలు సరిపోలకపోతే లింక్ కాదు
- దీనికి ఆన్ లైన్ ద్వారా పాన్ లో కరెక్షన్ చేసుకోవచ్చు
పాన్ కార్డ్ అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి. ఐటీ రిటర్నుల కోసమే కాదు, బ్యాంకుల్లో రూ.50వేలకు మించి నగదు డిపాజిట్ చేస్తున్నా, తీసుకుంటున్నా పాన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లో పెట్టుబడులకూ ఇది కావాల్సిందే. 30 లక్షలకు మించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు సైతం పాన్ ఇవ్వాలి. కనుక పాన్ అవసరం దాదాపు అందరికీ ఉంటుంది. పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలంటూ ప్రభుత్వం నిబంధన తీసుకురావడం తెలిసిందే. ఇప్పటికీ లింక్ చేసుకోని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఆధార్ తో పాన్ లింక్ చేసుకునే విషయంలో పేరు లేదా డెమోగ్రాఫిక్ వివరాలు మ్యాచ్ కావడం లేదనే సమాచారం కొందరికి కనిపిస్తుంది. దీనికి కారణం ఆధార్ లో ఒక మాదిరిగా, పాన్ లో ఒక మాదిరిగా పేరు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. ఇలా పాన్ కార్డు, ఆధార్ లో వేర్వేరుగా వివరాలు ఉంటే కరెక్షన్ చేసుకోవడం ఒక్కటే మార్గం. పాన్ లో ఉన్నట్టుగా ఆధార్ లో మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అందుకు గుర్తింపు పత్రాలను కూడా జోడించాలి. అదే ఆధార్ ప్రకారం పాన్ లో మార్పులు చేసుకోవాలంటే, అది కూడా సులభమే.
- ఇందు కోసం ఎన్ఎస్ డీఎల్ పోర్టల్ కు వెళ్లాలి. పాన్ కార్డ్ సర్వీసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ ను క్లిక్ చేయాలి. https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
- అప్పుడు పాన్ డేటాలో వివరాల కరెక్షన్ కు వీలుగా ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. వివరాలు నమోదు చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి.
- అక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. అప్లికేషన్ ను డాక్యుమెంట్లతో కలిపి భౌతికంగా పంపిస్తారా లేక డిజిటల్లీ ఈకేవైసీ, ఈసైన్ ద్వారా సబ్ మిట్ చేస్తారా అని అడుగుతుంది. ఈ రెండింటిలో ఆన్ లైన్ లో చేసుకునేందుకు వీలుగా డిజిటల్లీ ఈ కేవైసీ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
- అప్పుడు వివరాలన్నీ అప్ డేట్ అవుతాయి. క్లిక్ సేవ్ ను సెలక్ట్ చేసుకోవాలి.
- అనంతరం పాన్ ను నమోదు చేయాలి. అప్ డేట్ చేసిన పాన్ కార్డును ఫిజికల్ గా కావాలా లేక డిజిటల్ గా కావాలా అని అడుగుతుంది.
- ఆధార్ లో చివరి నాలుగు నంబర్లను నమోదు చేయాలి. ఆధార్ లో ఉన్న ఫొటోనే పాన్ పైనా కోరుకుంటున్నారా? లేదా? తెలియజేయాలి.
- ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు నమోదు చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసి అక్కడ అడిగినంత నగదు చెల్లించాలి. అనంతరం అక్ నాలెడ్జ్ మెంట్ వస్తుంది. అనంతరం యూఐడీఏఐ నుంచి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయగానే అప్లికేషన్ ప్రాసెసింగ్ కు వెళుతుంది.
- అప్పుడు ఆధార్ డేటాబేస్ లోని వివరాలు పాన్ లోకి వచ్చేస్తాయి. మరోసారి ఓటీపీతో దీన్ని ధ్రువీకరించాలి. ఆ వివరాలు ధ్రువీకరించి సబ్ మిట్ కొట్టాలి.
- మరో ఓటీపీ వస్తుంది. అప్లికేషన్ ను ఈ సైన్ కోసం దీన్ని ఉపయోగించుకోవాలి.