దగ్గు మందులో విష పదార్థాలను ఉపయోగించిన మాయదారి ఫార్మా కంపెనీ!

  • మారియన్ బయోటెక్ దగ్గు మందుల్లో ప్రమాదకర ప్రాపిలెన్ గ్లైకాల్
  • ఫార్మా గ్రేడ్ కు బదులు పారిశ్రామిక గ్రేడ్ వినియోగించినట్టు వెల్లడి
  • ఇంకా పూర్తి కాని కేసు దర్యాప్తు
ప్రాణాలను కాపాడాల్సిన ఉత్పత్తులు.. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకోవడం వెనుక దారుణ వాస్తవం వెలుగులోకి వచ్చింది. స్వప్రయోజనాల కోసం, లాభాల కోసం మారియన్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ అనైతిక పోకడలు పోయినట్టు వెల్లడైంది. గతేడాది భారత్ కు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మా సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్ లు (యాంబ్రోనాల్, డాక్ 1 మ్యాక్స్) తాగి ఉజ్బెకిస్థాన్ లో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గుర్తుండే ఉంటుంది.దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో విచారణకు భారత సర్కారు ఆదేశించింది.

మారియన్ బయోటెక్ ఫార్మా గ్రేడ్ కు బదులు, ప్రమాదకర ఇండస్ట్రియల్ గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ ను వినియోగించినట్టు, దీన్ని మాయా కెమ్ టెక్ ఇండియా నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఫార్మాస్యూటికల్ గ్రేడ్ మెటీరియల్స్ ను విక్రయించే లైసెన్స్ మాయా కెమ్ టెక్ కు లేదు. కేవలం ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉత్పత్తులను విక్రయిస్తుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. 

లిక్విడ్ డిటర్జెంట్ (సబ్బు ద్రావకం), పెయింట్స్, కోటింగ్స్, పురుగు మందుల తయారీలో ఈ పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ ను వినియోగిస్తుంటారని కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. దగ్గు మందు తయారు చేయడానికి ముందు ప్రాపిలెన్ గ్లైకాల్ ను మారియన్ బయోటెక్ టెస్ట్ చేయలేదని చెప్పారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. చిన్నారుల మరణం తర్వాత దగ్గు మందులను ఉజ్బెకిస్థాన్ పరీక్షించి చూసింది. ఆమోదం కాని స్థాయిలో డైఎథిలిన్ గ్లైకాల్, ఎథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించడం గమనార్హం.


More Telugu News