హెచ్1బీ వీసా హోల్డర్లకు కెనడాలోకి ఎంట్రీ ఫ్రీ.. వర్క్ పర్మిట్ కూడా ఉచితమే

  • వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులూ పనిచేసుకోవచ్చంటున్న ట్రూడో సర్కారు
  • పది వేల మందికి అవకాశం కల్పించనున్నట్లు కెనడా మంత్రి ప్రకటన
  • మూడేళ్ల తాత్కాలిక నివాసానికి అనుమతించనున్నట్లు వెల్లడి
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న వారికి కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులతో పాటు కెనడాలోకి వచ్చి పనిచేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వివరించింది. దేశంలో ఎక్కడైనా, ఏ కంపెనీలోనైనా పనిచేసుకునేందుకు అనుమతిస్తామని తెలిపింది. అంతేకాదు.. వీసా హోల్డర్ల కుటుంబ సభ్యులకూ పలు మినహాయింపులు ప్రకటించింది. వారు కూడా కెనడాలో చదువుకోవచ్చు లేదా పనిచేసుకునేందుకు పర్మిషన్ ఇస్తామని కెనడా ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రేజర్ మంగళవారం పేర్కొన్నారు. 

ఇలా దేశంలోకి అడుగుపెట్టే హెచ్1బీ వీసా హోల్డర్లకు మూడేళ్ల పాటు తాత్కాలిక నివాస హోదా కల్పిస్తామని మంత్రి వివరించారు. అయితే, ఈ అవకాశం కేవలం 10 వేల మందికి మాత్రమేనని, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చే విదేశీ నిపుణులకు ఇచ్చే వీసానే ఈ హెచ్1బీ.. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను డింపెండెంట్ వీసాపై అమెరికా తీసుకుని వెళ్లవచ్చు.

ఇలా అమెరికాలో అడుగుపెట్టే వారు ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిలో భారతీయులు, చైనా వారే ఎక్కువగా ఉన్నారు. వృత్తిపరంగా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారికే అమెరికా ఈ హెచ్1బీ వీసా జారీ చేస్తుంది. ఈ క్రమంలో నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు కెనడా ప్రభుత్వం తాజా వెసులుబాటు కల్పించింది.


More Telugu News