బీఆర్ఎస్ అధిష్ఠానానికి తీగల కృష్ణారెడ్డి వార్నింగ్.. టికెట్ ఇవ్వకుంటే కారు దిగేస్తానన్న మాజీ ఎమ్మెల్యే

  • అధిష్ఠానం తీరుపై తీగల అసంతృప్తి
  • వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఇవ్వాల్సిందేనన్న మాజీ ఎమ్మెల్యే
  • సబితను చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారని విమర్శ
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుంటే కారు దిగేడయం ఖాయమని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ.. తమ కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉండడంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవని చెబుతున్నారని అన్నారు. తాను కూడా కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేశారు. 

ఉద్యమంలో పనిచేసిన సీనియర్ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారని, వారందరినీ పిలిచి మాట్లాడాలని, లేదంటే తమ దారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారని విమర్శించారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీని వదిలేస్తానన్న తీగల.. అదే జరిగితే ఏ పార్టీలోకి వెళ్తానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, కాంగ్రెస్ నుంచి మాత్రం తనకు ఎలాంటి పిలుపు రాలేదని మాత్రం చెప్పుకొచ్చారు.


More Telugu News