ఆ ఎమ్మెల్యేని జగన్ మందలించే పరిస్థితి లేదు: నారా లోకేశ్

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర
  • గూడూరు నియోజకవర్గం తాడిమేడు క్రాస్ వద్ద మత్స్యకారులతో లోకేశ్ భేటీ
  • ఫిష్ ఆంధ్రా పేరుతో జగన్ ఫినిష్ ఆంధ్రాగా మార్చాడని విమర్శలు
  • మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశాడని ఆరోపణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. వాకాడులో పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. 139వ రోజు యువగళం పాదయాత్ర తాడిమేడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్రకు జనం పెద్దఎత్తున తరలివచ్చి యువగళానికి సంఘీభావం తెలిపారు. తాడిమేడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తగుంట, చిట్టమూరు, వాకాడు, రంగన్నగుంట, తిన్నెలపూడి మీదుగా కోట క్రాస్ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. 

ఫిష్ ఆంధ్రా పేరుతో ఫినిష్ ఆంధ్రాగా మార్చిన జగన్మోహన్ రెడ్డి

మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీవో నెం.217ను టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. గూడూరు నియోజకవర్గం తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్ వద్ద మత్స్యకారులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మత్స్యకారుల సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జగన్ పాలనలో మ్యాటర్ వీక్... పబ్లిసిటీ పీక్ అని ఎద్దేవా చేశారు. ఫిష్ ఆంధ్రా అని హడావిడి చేసి ఫినిష్ ఆంధ్రా చేశాడని విమర్శించారు. 

"పులికాట్ సరస్సు సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉంది. తమిళనాడు జాలర్లు దాడులు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే మత్స్యకారులను కుక్కలతో పోల్చి తిడితే జగన్ కనీసం ఎమ్మెల్యేని పిలిచి మందలించే పరిస్థితి లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీస్తాం. ఛానల్ కాలువల్లో పూడిక తీసి బోట్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తాం" అని హామీ ఇచ్చారు.

డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తాం

మత్స్యకారుల సౌకర్యార్థం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైయింగ్ ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తాం. తమిళనాడు సీఎంతో చర్చలు జరిపి జాలర్ల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల వారు ఇటు వేటకి రాకుండా నియంత్రిస్తాం. తమిళనాడు స్టీమర్లు ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటాం. 

టీడీపీ హయాంలో ఏపీని మత్స్యకారప్రదేశ్ గా మార్చాం. ఆక్వా ఎగుమతుల్లో చంద్రబాబు ఏపీని నెంబర్ వన్ గా చేశారు. 

జగన్ పాలనలో ఫిష్ ఆంధ్రా అని తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్రా చేశాడు. చేపల వ్యాపారం ఎలా చెయ్యాలో మీకు మేము నేర్పించాల్సిన అవసరం లేదు. అది మీకు తెలిసిన విద్య. ప్రభుత్వం మత్స్యకారులకు సహాయం అందించాలి. అది మానేసి ఫిష్ ఆంధ్రా అంటూ హడావిడి చేశాడు. ఇప్పుడు ఏకంగా పులివెందులలో కూడా ఫిష్ ఆంధ్రా ఫినిష్ అయ్యింది.

మత్స్యకారుల సంక్షేమానికి 800 కోట్లు ఖర్చుచేశాం!

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మత్స్యకారులను ఆదుకున్నాం. ఐదేళ్ల లో రూ.800 కోట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చాం. మత్స్యకార పిల్లల చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీతో బోట్లు, వలలు, డీజిల్, టీవీఎస్ బండ్లు అందజేశాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేట విరామ సమయంలో భృతి ఇచ్చి ఆదుకున్నాం..

సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దుచేసిన జగన్

టీడీపీ హయాంలో మత్స్యకారులకు ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశాడు. జీవో నెం.30 తీసుకొచ్చి మత్స్యకారులకి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. జగన్ పాలనలో జీవో నెం.217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్టకొట్టారు. చెరువులు, రిజర్వాయర్లు అన్ని వైసీపీ నాయకులు లాక్కున్నారు. 

ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల జీవనోపాధిగా ఉన్న చెరువులు లాక్కొని వారికి జగన్ తీరని అన్యాయం చేశాడు. సబ్సిడీ రుణాలు, వలలు, బోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు బెట్టే లెక్కలు కూడా మత్స్యకారుల ఖాతాలో రాస్తున్నారు. 

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం

టీడీపీ హయాంలో ఆక్వా రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టీడీపీ హయాంలో మత్స్య సంపద పెంచడానికి ప్రతి ఏడాది చేప పిల్లలు పెద్ద ఎత్తున చెరువుల్లో, రిజర్వాయర్లలో వదిలిపెట్టాం. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో తుపాను షెల్టర్లు ఏర్పాటు చేస్తాం. 

టీడీపీ హయాంలోనే చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చాం. జగన్ వైఎస్సార్ బీమా అని పేరు మార్చి ఆయనకి చెడ్డ పేరు తెచ్చాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా మరింత పటిష్టంగా అమలు చేస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులకు అవసరం అయిన అన్ని పనిముట్లు అందజేస్తాం.

మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి లోకేశ్ భరోసా

గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు లోకేశ్ ను కలిశారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మృతుడి భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది. 

వెంకటరమణ ఇద్దరు పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చిన లోకేశ్ కార్యకర్తల సంక్షేమ నిధినుంచి ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమానికి రూ.135 కోట్లు వెచ్చించామని, తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం ఎంత సొమ్ము వెచ్చించడానికైనా వెనుకాడబోమని స్పష్టంచేశారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1821.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.6 కి.మీ.*

*140వ రోజు పాదయాత్ర వివరాలు (28.6.2023):*

*గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

సాయంత్రం

4.00 – కోట క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – కోట శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో స్థానికులతో సమావేశం.

4.20 – శ్యామసుందరపురంలో స్థానికులతో సమావేశం.

4.25 – కోటలోని దివంగత గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద రైతులతో భేటీ.

4.35 – కోట ఆర్టీసీ బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.

4.45 – కోట గాంధీ విగ్రహం వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.15 – కొక్కుపాడు లింగస్వామి కాలనీలో స్థానికులతో భేటీ.

6.25 – కొక్కుపాడులో స్థానికులతో మాటామంతీ.

6.30 – సూరిశెట్టిపాలెంలో స్థానికులతో సమావేశం.

6.40 – ఉచావారిపాడులో స్థానికులతో సమావేశం.

6.50 – చిలకలదిబ్బలో స్థానికులతో సమావేశం.

7.10 – ఉత్తమనెల్లూరులో స్థానికులతో సమావేశం.

7.30 – కర్లపూడి సెంటర్ లో స్థానికులతో సమావేశం.

8.20 – కర్లపూడి ఎస్సీ కాలనీలో స్థానికులతో సమావేశం.

8.30 – కర్లపూడి ఎస్టీ కాలనీలో స్థానికులతో సమావేశం.

8.50 – కాకువారిపాలెం విడిది కేంద్రంలో బస.

******


More Telugu News